Amarnath Yatra | జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని అమర్నాథ్ గుహలో శనివారం ఉదయం ప్రథమపూజను నిర్వహించారు. దాంతో ఈ ఏడాది అమర్నాథ్ మొదలైనట్లయ్యింది. ఈ నెల 29 నుంచి అమర్నాథ్ గుహలో మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఉన్నది. యాత్ర మళ్లీ దాదాపు రెండు నెలల తర్వాత అంటే ఆగస్టు 19న యాత్ర ముగియనున్నది. శ్రీనగర్‌లోని రాజ్‌భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి అమర్నాథ్ను దర్శించేందుకు భక్తులు వస్తారని.. వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేశామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ట్రాక్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాల్లో ఒకేసారి ప్రారంభంకానున్నది. ఈసారి యాత్రకు భారీగా భద్రతను కల్పించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్నాథ్ గుహను సందర్శించారు.