AAP : అరవింద్ కేజ్రీవాల్ స్ధానంలో ఢిల్లీ నూతన సీఎంగా అతీశి పాలనా పగ్గాలు చేపట్టనుండటంపై ఆప్ మంత్రి అమన్ అరోరా స్పందించారు. అరోరా మంగళవారం చండీఘఢ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలైన అనంతరం జవాబుదారీతనంలో కేజ్రీవాల్ ఇవాళ నూతన అధ్యాయాన్ని లిఖించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యున్నతమైనదని, తనపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో తిరిగి ప్రజల ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ఆప్‌నకు సీఎం పదవి కంటే విలువలు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన అనంతరం ఆప్‌లో చీలికకు కాషాయ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నించిందని ఆరోపించారు. కానీ ఆ ప్రయత్నాల్లో బీజేపీ నేతలు విఫలమయ్యారని అన్నారు. బీజేపీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలున్నా వారు అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సత్వరమే జరిపిస్తే ఎవరు నిజాయితీపరులో, ఎవరు అవినీతిపరులన్నది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.
కాగా, ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతీశి ఢిల్లీ నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అతీశి డమ్మీ సీఎం అని, అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఆమె పాలన సాగిస్తారని బీజేపీ ఆరోపించింది. కాషాయ పార్టీ ఆరోపణలను ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ తోసిపుచ్చారు. అతీశిని ఆప్ శాసనసభాపక్ష నేతగా, ఢిల్లీ తదుపరి సీఎంగా ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని పేర్కొన్నారు. బీజేపీ చవకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాగా, ఢిల్లీ సీఎంగా అతిశీ (Atishi) అద్భుతంగా పనిచేస్తారని తాను ఆశిస్తున్నానని, ఆమెకు అభినందనలు తెలియచేస్తున్నానని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పేర్కొన్నారు.
Read More :
Swaminarayan temple: న్యూయార్క్‌లో స్వామినారాయణ్ ఆలయంపై దాడి