Karnataka | బెంగళూరు, ఆగస్టు 7: కర్ణాటకలో ‘40% కమీషన్ సర్కారు’గా అపఖ్యాతి పొందిన మునుపటి బీజేపీ ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా నడుస్తున్నది. రాష్ట్రంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు కాలేదు. అప్పుడు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గత నెలలో చేపట్టిన ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇప్పటికే ఆరోపణలు రాగా.. తాజాగా ఓ మంత్రిపై లంచం ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. వ్యవసాయశాఖ మంత్రి ఎన్ చలువరాయ స్వామి లంచం ఇవ్వాలని తమను వేధిస్తున్నాడని, రూ.6-8 లక్షలు డిమాండ్ చేస్తూ ఒత్తిడి చేస్తున్నారని మండ్య జిల్లాకు చెందిన కొంత మంది వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని, అవినీతిని ఆపాలని, మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే విషం తాగి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప, తమకు మరో దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు గవర్నర్ లేఖ
మండ్య జిల్లాలోని వివిధ తాలూకాలకు చెందిన ఏడుగురు అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్లు గవర్నర్‌కు ఈ లేఖ రాశారు. మండ్య, మలవల్లి, కేఆర్ పేట్, పండవపుర, నగమంగళ, శ్రీరంగపట్న, మద్దూరు తాలూకాల డైరెక్టర్లు ఈ లేఖ రాసినట్టు తెలుస్తున్నది. వ్యవసాయ శాఖ అధికారుల లేఖపై గవర్నర్ థావర్ చంద్ స్పందించారు. మంత్రిపై అవినీతి ఆరోపణల అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మను ఆదేశించారు. తక్షణం స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి గవర్నర్ ఈ నెల 1న లేఖ రాశారు. అయితే తనపై అవినీతి ఆరోపణలను మంత్రి చలువరాయ స్వామి సోమవారం ఖండించారు. డైరెక్టర్లు రాసిన లేఖ ఫేక్ అని, ఇది తనను అప్రతిష్ఠ పాల్జేసే ప్రయత్నాల్లో భాగమని అన్నారు. విచారణ చేయాలని సీఎంతో పాటు మండ్య జిల్లా ఎస్పీ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌ను కోరానని తెలిపారు.
ఉద్యోగుల బదిలీల్లోనూ అవినీతి!
మంత్రి చలువరాయ స్వామిపై గతంలో కూడా అవినీతి అరోపణలు గుప్పుమన్నాయి. ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడ్డారని, రాజకీయ అవసరాల కోసం ఉద్యోగులను బలి తీసుకొంటున్నారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కారణం చెప్పకుండా తనను వేరే తాలూకాకు బదిలీ చేశారని ఆరోపిస్తూ గత నెల 6న కేఎస్ఆర్టీసీ నగమంగళ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేసే జగదీశ్ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్రమంగా జరిగిన తన బదిలీకి మండ్య జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామినే కారణమని సూసైడ్ నోట్ కూడా రాశాడు. గత నెల జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.