Rahul Gandhi : భారత్‌లో సిక్కుల మతస్వేచ్ఛపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గత ఏడాది అమెరికా (US) లో చేసిన వ్యాఖ్యలు ఆయనను చిక్కుల్లో పడేశాయి. ఆ వ్యాఖ్యలపై వారణాసిలోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్‌గాంధీ అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో రాహుల్‌గాంధీకి చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ (శుక్రవారం) తోసిపుచ్చింది. దాంతో రాహుల్‌గాంధీ స్పెషల్ కోర్టు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాహుల్‌గాంధీ 2024లో అమెరికాలో పర్యటించినప్పుడు.. భారతదేశంలో సిక్కులు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను పాటించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. వాషింగ్టన్ డీసీ శివార్లలోని హండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ‘సిక్కులు తలపాగాలు ధరించవచ్చా, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా? అనే వాటిపైనే భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి’ అని రాహుల్ చెప్పారు.
అయితే రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్‌పై ఎఫ్ఐఆర్కు ఆదేశించాలని కోరుతూ వారణాసికి చెందిన నాగేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. కానీ ప్రసంగం అమెరికాలో చేసినందున తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను 2024 నవంబర్‌లో అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. అయితే కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జి (ఎంపీ/ఎమ్మెల్యే) ఈ ఏడాది జూలై 21న మిశ్రా రివిజన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
మిశ్రా పిటిషన్‌పై విచారణ జరుపాలని ఈ ఏడాది ఆగస్టులో అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు చర్య తప్పని, చట్టవిరుద్ధమని రాహుల్ తన రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ రివిజన్ పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు తోసిపుచ్చింది.