 
                                                            న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : జిల్లా న్యాయస్థానాలలో నియామకాల విషయంలో హైకోర్టులకు ఉన్న రాజ్యాంగపరమైన అధికారాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దంటూ అలహాబాద్ హైకోర్టు వాదించడంతో బుధవారం సుప్రీంకోర్టులో రాజ్యాంగ నిబంధనలపై వాడీవేడి చర్చ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట అలహాబాద్ హైకోర్టు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది సుప్రీంకోర్టు సంయమనం పాటించాలని కోరారు. జిల్లా జడ్జీలకు చెందిన ప్రత్యక్ష నియామకాలు, ప్రమోషన్లలో కోటాకు సంబంధించిన అంశాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని ఆయన కోరారు. రాజ్యాంగానికి చెందిన 6వ భాగంలోని 6వ అధ్యాయాన్ని ఉటంకిస్తూ అనుబంధ న్యాయవ్యవస్థపై హైకోర్టులకు విచక్షణాధికారాలు ఉంటాయని రాకేశ్ తెలిపారు. జిల్లా కోర్టులకు చెందిన వాస్తవ పరిస్థితులు హైకోర్టులకు పూర్తిగా తెలుసునని, ప్రమోషన్లు, నియామకాల విషయంలో తలెత్తే సమస్యలను హైకోర్టులే చక్కదిద్దుతాయని ఆయన చెప్పారు.
అయితే హైకోర్టుల అధికారాలను నియంత్రించే ఉద్దేశం తమ ధర్మాసనానికి లేదని సీజేఐ గవాయ్ అలహాబాద్ హైకోర్టుకు స్పష్టం చేశారు. జిల్లా కోర్టుల నియామకాలలో హైకోర్టులకు ఉన్న విచక్షణాధికారాలను తాము చేజిక్కించుకోబోమని ఆయన తెలిపారు. అయితే ప్రతి హైకోర్టు వేర్వేరు విధానాలు ఎందుకు ఉంటున్నాయని ఆయన ప్రశ్నించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టుల అధికారాలలో తాము జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అన్ని హైకోర్టులకు కలిపి తాము సాధారణ ఆదేశాలు మాత్రమే ఇస్తామని ఆయన తెలిపారు. జిల్లా న్యాయస్థానాలలో ప్రత్యక్ష నియామకాలు, ప్రమోషన్లలో ఉమ్మడి కోటా విధానాన్ని అమలు చేసే విషయాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేవీ చంద్రన్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి కూడా ఉన్న రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తోంది.
 
                            