అలహాబాద్, జూన్ 4: భారత్ జోడో యాత్ర సందర్భంగా భారతీయ సైనికులపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారతీయ సైనాన్ని అప్రతిష్ట పాల్జేసే విధమైన వ్యాఖ్యలపై లక్నో కోర్టు జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు ఆయనను మందలించింది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని కల్పిస్త్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని, అయితే దీనికీ కొన్ని సహేతుకమైన పరిమితులు ఉంటాయని, భారతీయ సైన్యాన్ని అప్రతిష్ట పాల్జేసే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా ఈ పరిమితుల పరిధిలోనే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.