లక్నో, జూన్ 8: ఉత్తరప్రదేశ్లో నాలుగు నెలల క్రితం జరిగిన మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో ఎంతోమంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల్ని ఆదుకోవాల్సిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తన విధిని నిర్వర్తించటంలో విఫలమైంది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయకుండా యూపీ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం విమర్శించింది.
ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్పై గత శుక్రవారం విచారణ జరుపుతూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత కుటుంబం పట్ల అత్యంత దయ, గౌరవంతో పరిహారం చెల్లించటం రాష్ట్ర ప్రభుత్వ తప్పనిసరి విధిగా పేర్కొన్నది. మరణించిన వారి మృత దేహాల్ని బాధిత కుటుంబాలకు అందజేయటంలో ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన వైఖరిపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఘటన జరిగి నాలుగు నెలలైనా ఒక బాధిత కుటుంబానికీ నష్ట పరిహారం దక్కకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాల పట్ల సర్కార్ నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రదర్శిస్తున్నట్టు భావిస్తున్నామని న్యాయమూర్తులు అన్నారు.