న్యూఢిల్లీ, జూన్ 1: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ గురువారం, సోనియా గాంధీ ఈ నెల 8న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. సోనియా ఈ నెల 8న ఈడీ దర్యాప్తునకు హాజరవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి విలేకరుల సమావేశంలో చెప్పారు.
తాను విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత హాజరును 5వ తేదీ తర్వాతకు మార్చాలని రాహుల్ గాంధీ ఈడీకి లేఖ రాసినట్టు మరో నేత రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. బీజేపీ కుటిల యత్నాలకు కాంగ్రెస్ భయపడదని, తల వంచదని సింఘ్వి పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, పవన్ బన్సల్‌లను ప్రశ్నించింది.