బీజేపీతో పొత్తు.. ధృతరాష్ట్ర కౌగిలే!
బీజేపీతో పొత్తు పెట్టుకొన్న ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదా? స్టేట్ పార్టీలతో తొలుత పొత్తు పెట్టుకొని బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తుందా.
- కమలంతో కలిసిన ప్రాంతీయ పార్టీలన్నీ చెల్లాచెదురు
- బెంగాల్లో బీజేపీ ప్రవేశానికి తొలుత బాటలు వేసిన దీదీ
- ఇప్పుడు మమత కంచుకోటలోనే పాగా వేసిన కమలం
- జేడీయూ,జేడీఎస్, శివసేన, శిరోమణి, ఎల్జేపీ వంటి పార్టీల భవిష్యత్తు అగమ్యగోచరం
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): బీజేపీతో పొత్తు పెట్టుకొన్న ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదా? స్టేట్ పార్టీలతో తొలుత పొత్తు పెట్టుకొని బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తుందా? చివరకు పొత్తు కుదుర్చుకొన్న మిత్రపక్షాన్నే బలహీనపరుస్తుందా? మొత్తంగా కమలంతో దోస్తీ చేస్తే ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్నట్టేనా? దేశ రాజకీయాల్లో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
నితీశ్‌ను పక్కన పెట్టారిలా..
బీహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ మకుటం లేని మహారాజుగా వెలిగారు. 20 ఏండ్లపాటు రాష్ర్టానికి సీఎంగా పని చేశారు. అయితే, విడతల వారీగా బీజేపీతో కొనసాగిన దీర్ఘకాల పొత్తు జేడీయూ బలహీనంగా మారడానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొన్న ప్రతీసారి ఎన్నికల్లో మెజార్టీ సీట్లను జేడీయూ తీసుకొగా, బీజేపీకి పరిమిత సీట్లను కేటాయించేది. అయితే, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు సమానమైన స్థానాల్లో పోటీచేయగా, జేడీయూ కంటే బీజేపీ కొన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. జేడీయూను క్రమంగా బలహీనం చేస్తూ, ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించడమే దీనికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు, నితీశ్‌ను పక్కకు తప్పించి.. బీజేపీ తన పార్టీ నాయకుడు సమ్రాట్ చౌధరీని బీహార్‌కు ముఖ్యమంత్రిని చేసింది.
బీజేపీకి మమత ఎర్ర తివాచీ
ఇటీవలి బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ని ఓడించి ఎవరూ ఊహించని విధంగా బీజేపీ మెజార్టీ సీట్లను సాధించింది. పదేండ్ల కిందట బెంగాల్లో కేవలం మూడు సీట్లను గెలుచుకోవడానికి ఆపసోపాలు పడిన బీజేపీ.. తాజా ఎన్నికల్లో ఏకంగా 207 స్థానాలను గెలుచుకొన్నది. అయితే, బెంగాల్లో బీజేపీ పాతుకుపోవడానికి ఒకవిధంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీనే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని 1988లో టీఎంసీని స్థాపించిన మమత.. తొలిరోజుల్లో బీజేపీతో జట్టుకట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ తొలి ఎంపీ సీటు, తొలి శాసనసభ స్థానం గెలుచుకోవడానికి మమత పార్టీ మద్దతు ఇచ్చినట్టు చెప్తున్నారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మమత రైల్వే మంత్రిగా, బొగ్గు శాఖ మంత్రిగా సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు అధికార పక్షంగా మారగా.. టీఎంసీ మాత్రం ప్రతిపక్ష హోదాకు పడిపోయినట్టు చెప్తున్నారు.
ఈ పార్టీలదీ అదే వరుస..
జేడీయూ, టీఎంసీ మాత్రమే కాదు.. బీజేపీ పొత్తు పెట్టుకొన్న ప్రాంతీయ పార్టీలు ఆ తర్వాతి కాలంలో బలహీనమైనట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో శివసేన పార్టీలో, బీహార్‌లో ఎల్జేపీ చీలికలు ఏర్పడి ఆ పార్టీలు బలహీనం కావడానికి కూడా బీజేపీనే ప్రధాన కారణమని గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు బలమైన పార్టీలుగా కొనసాగిన కర్ణాటకలోని జేడీఎస్, పంజాబ్‌లోని శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ), యూపీలోని అప్నాదళ్ (సోనేలాల్), అస్సాంలోని అసోమ్ గణ పరిషద్, బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, తమిళనాడులోని పట్టాలీ మక్కల్ కట్చీ వంటి పార్టీలతో పాటు మరికొన్ని చిన్న పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకొన్న తర్వాత క్రమక్రమంగా బలహీనమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengal elections
- BJP Party
- jds
- JDU
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

