అశ్వారావుపేట, ఆగస్టు 13 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించడంలోనూ కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా కొత్త యూనిఫాంను ప్రభుత్వం పంపిణీ చేయలేదు. దీంతో వారంతా పాత దుస్తులు, పాత యూనిఫాం ధరించే పాఠశాలలకు వెళ్తున్నారు. నూతనంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులైతే రెండు నెలలుగా పడిగాపులు కాస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,296 పాఠశాలలు ఉండగా.. వాటిల్లో 59,182 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు కొత్త యూనిఫాం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ, ప్రభుత్వమే యూనిఫాం పంపకపోవడంతో క్షేత్రస్థాయిలో విద్యార్థులు పాత దుస్తులు, సివిల్ డ్రస్సులతోనే తరగతులకు హాజరవుతున్నారు. అయితే, పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటికైనా యూనిఫాం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా యూనిఫాం కుట్టే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అప్పగించాలని నిర్ణయించింది. కానీ, ఆ సంఘాలకు కూడా ఇప్పటి వరకు వస్త్రం అందించలేదు. ఫలితంగా రెండు నెలలుగా యూనిఫాం లేకుండా సివిల్ డ్రస్సులతోనే విద్యార్థులందరూ తరగతులకు హాజరవుతున్నారు.
యూనిఫాం కోసం విద్యార్థులు రెండు నెలలుగా నిరీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకే వస్త్రం చేరలేదు. దీంతో విద్యార్థులకు యూనిఫాం అందడానికి ఇంకెన్ని నెలల సమయం పడుతుందోనన్న అసహనం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,311 ప్రభుత్వ పాఠశాలలు, 14 కేజీబీవీలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యూఆర్ఎస్) ఉన్నాయి. వీటిల్లో కేజీబీవీలు, యూఆర్ఎస్ల విద్యార్థులకు మాత్రమే కాస్త ఆలస్యంగానైనా యూనిఫాం అందించింది. ఇక 1,296 ప్రభుత్వ పాఠశాలలకు కనీసం వస్త్రం కూడా అందలేదు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో 59,182 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 30,290 మంది బాలురు, 28,892 మంది బాలికలు ఉన్నారు. మరో మూడు రోజుల్లో పంద్రాగస్టు వస్తున్నా పాత దుస్తులతోనే విద్యార్థులు స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కావాల్సిన దయనీయ స్థితి నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాం రంగులను మారుస్తోంది. గత ఏడాది ఎరువు, బిస్కెట్ కలర్ చెక్స్ యూనిఫాం అందించింది. ఈ ఏడాది మళ్లీ నీలిరంగు దుస్తులు అందించాలని మార్పు చేసింది. రంగులతోపాటు డిజైన్లోనూ మార్పులు చేసింది. బాలురకు నీలిరంగు చొక్కా, లేత నీలిరంగు నిక్కర్ లేదా ప్యాంటు; బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్ ఇవ్వనుంది. కొత్త డిజైన్‌ను ఖరారు చేసినా వస్త్రం సరఫరా చేయకపోవడంతో యూనిఫాం తయారై విద్యార్థులకు ఎప్పటికి అందుతుందోనన్న స్పష్టత కనిపించడం లేదు.
కొలతలు తీసుకొని యూనిఫాం కుట్టడానికి కనీసం రెండు నెలలైనా సమయం పడుతుందని విద్యాశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. నిరుడు యూనిఫాం కొలతల్లో తేడాలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొందరు విద్యార్థులకు సైజు తక్కువగా, మరికొందరికి ఎక్కువగా వచ్చాయి. చేసేదేమీ లేక విద్యార్థులు వాటితోనే సరిపెట్టుకున్నారు. ఈసారి ముందస్తు ప్రణాళికతో కొలతలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వస్త్రం సరఫరా ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ విషయమై ప్రభుత్వం కనీసం నోరు విప్పకపోవడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఇచ్చే యూనిఫాం కొంత ఊరటనిస్తుంది. కానీ, సకాలంలో ఆ యూనిఫాంను ప్రభుత్వం అందించకపోవడంతో వీరు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పాఠశాలలు తెరిచినప్పుడే యూనిఫాం అందించినట్లయితే దుస్తుల సమస్య ఉండేది కాదు. సరైన సివిల్ డ్రస్‌లు కూడా లేక కొందరు పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు ఇబ్బందులు పడుతూనే పాఠశాలలకు హాజరవుతున్నారు.
పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇంకా యూనిఫాం అడ్రస్ లేదు. ప్రతి రోజూ సివిల్ డ్రెస్‌తోనే తరగతులకు హాజరవుతున్నాను. స్కూలుకు ఇంకా యూనిఫాం రాలేదని టీచర్లు చెబుతున్నారు.
-ప్రవల్లిక, 10వ తరగతి విద్యార్థిని, దమ్మపేట
రెండు నెలలుగా యూనిఫాం అందకపోవడంతో సివిల్ డ్రస్సులతోనే పాఠశాలకు వెళ్లి వస్తున్నాను. కొందరు విద్యార్థులు గత ఏడాది యూనిఫాంతో పాఠశాలలకు వస్తున్నారు. పాత దుస్తులు చిరిగిపోయినా సర్దుకుపోతున్నారు.
-షేక్ అనాస్, 9వ తరగతి విద్యార్థి, చండ్రుగొండ
మా అబ్బాయి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుకుంటున్నాడు. పాఠశాల తెరిచి రెండు నెలలైంది. ఇంత వరకు యూనిఫాం ఇవ్వలేదు. అధికారులు కూడా యూనిఫాం అందలేదని చెబుతున్నారు. త్వరగా యూనిఫాం అందించాలి.
-బత్తుల శ్రీను, విద్యార్థి తండ్రి, అన్నపురెడ్డిపల్లి