హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యోగులు సమరశంఖం పూరించారు. ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ 40 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 19న విద్యుత్తుసౌధ ఎదుట మహాధర్నా నిర్వహిస్తారు. గురువారం టీజీపీఈ జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు, సెక్రటరీ జనరల్ శ్రీధర్, తాజుద్దీన్‌బాబా, వైస్ చైర్మన్ మహేశ్, వజీర్ ప్రకటన విడుదల చేశారు.
ఆర్టిజన్లు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని టీజీ ట్రాన్స్‌కో, జెన్కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ జూన్ 18న యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఉమ్మడి సమావేశం నిర్వహించాలని పలుసార్లు నోటీసులు అందజేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. 40 రోజులుగా ఆందోళనలు చేసినా స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో మహాధర్నాకు ఉపక్రమించామని స్పష్టంచేశారు. గురువారం ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కరుణాకర్‌రెడ్డి, సదానందం, జనార్దన్‌రెడ్డి, రామకృష్ణ, మాధవరావు, వేణు, వెంకటేశ్, సురేశ్, శ్రీనివాస్‌రెడ్డి, ఈశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.