Ayodhya | అయోధ్య, జనవరి 12: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి హోటళ్ల అద్దె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూమ్ రేట్లు ఏకంగా 500 శాతం పెరిగాయి. అంతేకాకుండా, ప్రతి 10 గదులకు 8 గదులు నిండిపోయాయని అధికారులు వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది వరకు నగరానికి వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. నగరంలోని ప్రముఖ హోటల్ ‘ఇన్ రాడిషన్’లో గది అద్దె రూ.లక్ష వరకు చేరినట్టు ఇండియా టుడే నివేదిక వెల్లడించింది.
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేళ 11 రోజుల ఉపవాస దీక్ష చేపట్టనున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనను స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్నది. ఈ నేపథ్యంలో పండితుల సూచన మేరకు ఈ 11 రోజుల పాటు తాను ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రాణప్రతిష్ఠ వేళ శ్రీరాముడు 2.5 కిలోల విల్లును ధరించబోతున్నాడు. దీన్ని అయోధ్యకు చెందిన అమవా రామాలయ నిర్వాహకులు శ్రీరామ్‌జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేయనున్నారు. అచ్చంగా రామాయణంలో చెప్పినట్టే ఈ విల్లును రూపొందించినట్టు ఆలయ ట్రస్టీ ఒకరు తెలిపారు. ఈ విల్లు కోసం 600-700 గ్రాముల బంగారాన్ని వాడామని పేర్కొన్నారు.
రామాయణ థీమ్‌తో కూడిన బ్యాక్ కవర్లు, రామమందిరం, రాముడు, హనుమంతుడి చిత్రాలతో కూడిన కాషాయ జెండాలకు డిమాండ్ ఏర్పడింది.
ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం నుంచి అయోధ్యకు 5 లక్షల లడ్డూలను పంపనున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న జిల్లాల వాసులు అయోధ్యకు రావటాన్ని అధికారులు మూడు రోజుల పాటు నిషేధించారు. బస్తి, గోండా, సుల్తాన్పూర్, బారాబంకీ, అంబేద్కర్ నగర్, అమేథీ ప్రాంతాల్లో ఈ నిషేధం విధించారు.
రాబోయే రోజుల్లో అయోధ్యకు దేశ, విదేశాల నుంచి కోట్లాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పట్టణవ్యాప్తంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ సైన్ బోర్డులను 28 భాషల్లో రాయటం గమనార్హం. అందులో 22 భారతీయ భాషలు కాగా, 6 విదేశీ భాషలు ఉన్నాయి. హిందీ, ఉర్దూ, అస్సామీ, ఒరియా, కన్నడ, కశ్మీరీ, కొంకణి, గుజరాతీ, డోగ్రీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బంగ్లా, బోడో, మణిపూరి, మరాఠీ, మలయాళం, మైథిలి, సంథాలి, సంస్కృతం, సింధీ, అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ తదితర భాషల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.