లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఘోర పరాజయం ఎదురవనుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యోగి సర్కార్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహం చూస్తుంటే పశ్చిమ యూపీలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను బీజేపీ తన అభివృద్ధిగా చెప్పుకొంటోందని ఆరోపించారు.
గతంలో రోడ్లపై కొబ్బరి కాయ కొడితే కొబ్బరికాయ పగిలేదని, ఇప్పుడు రోడ్లు పగిలిపోయే కొత్త సంప్రదాయం ముందుకొచ్చిందని యోగి పాలనను అఖిలేష్ ఎద్దేవా చేశారు. మధురలో పార్టీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించే ముందు అఖిలేష్ ఓ వార్తా చానెల్‌తో మాట్లాడారు. లఖింపూర్ ఖేరిలో రైతులపైకి దూసుకెళ్లిన ఎస్‌యూవీలో ఉన్నది కేంద్ర మంత్రి కొడుకు అవునా..కాదా అనేది సీఎం వెల్లడించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.