తెలంగాణ సర్కార్ బాటలో అఖిలేశ్
రైతులకు పూర్తిగా, గృహాలకు 300 యూనిట్లు
లక్నో, జనవరి 1: దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్తు అందిస్తూ ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సర్కార్ బాటలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ నడుస్తున్నారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు కీలక ‘ఉచిత విద్యుత్తు’ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహాలతో పాటు వ్యవసాయ అవసరాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. గృహ వినియోగదారులు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు వినియోగించుకోవచ్చన్నారు. అయితే వ్యవసాయానికి ఎన్ని గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తామన్నది స్పష్టం చేయలేదు. శనివారం ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన అఖిలేశ్.. కొత్త సంవత్సరం 2022, కొత్త ఉత్తరప్రదేశ్‌లో కొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ కూడా యూపీ ప్రజలకు ఇదే హామీ ఇచ్చింది. తమ పార్టీని గెలిపిస్తే ఇండ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు 38 లక్షల కుటుంబాల బిల్లు బకాయిలను మాఫీ చేస్తామని, 24 గంటల విద్యుత్తు ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో కూడా ఆప్ ఇదేవిధమైన హామీలు ఇచ్చింది.