యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ప్రతి రోజు సాయంత్రం తాము ఏం మాట్లాడుతున్నారో వింటున్నారని అఖిలేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు సంబంధించిన అన్ని ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, మా మాటలన్నీ ప్రభుత్వం రికార్డు చేస్తోందన్నారు. తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపుతున్నారని ఆయన మండిపడ్డారు. విపక్షాలపై ప్రభుత్వం అనేక దండయాత్రలు చేస్తూనే ఉందని, అయినా తమ రథం ముందుకు సాగుతూనే ఉందన్నారు. యూపీలోని ప్రజలందరూ బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారని, ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నడిచిన దారుల్లోనే బీజేపీ కూడా నడుస్తోందని అఖిలేశ్ తీవ్రంగా విమర్శించారు.