ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తాజాగా వివరణ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం బీజేపీ ప్రభుత్వ మనుగడను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేశానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పది కాలాల పాటు చల్లగా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు కొందరు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం యూపీ ప్రభుత్వానికి సంబంధించినవని, యూపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నదే తన వ్యాఖ్యల అభిమతమని అఖిలేశ్ యాదవ్ వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు కాశీలో పర్యటించారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా కాశీ కారిడార్‌ను ప్రారంభించారు. గంగలో పవిత్ర స్నానమాచరించారు. ఆ తర్వాత దశాశ్వమేధ ఘాట్‌లో నిర్వహించిన గంగా హారతిలో పాల్గొన్నారు. ప్రధాని పర్యటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ జీవిత చరమాంకంలో కాశీలోనే ఉండాలని భావిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ఒకటి కాదు… మూడు రోజుల పాటు ఆయన కాశీలో ఉండొచ్చు. అలా ఉండడానికి పూర్తి అర్హత గల ప్రదేశమే. అయితే ప్రజలు తమ చివరి రోజుల్లో కాశీలోనే గడుపుతారు” అంటూ అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.