UP Polls | యూపీ అసెంబల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బీజేపీ అధిష్ఠానం ఈసారి టిక్కెట్ ఇవ్వదని మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఏ కారణాల రీత్యా ఆయనకు టిక్కెట్ ఇవ్వదనే విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. గతంలోనూ అఖిలేశ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. యూపీ బీజేపీలో సగం మంది కార్యకర్తలు యోగిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన శైలి ఏమాత్రం నచ్చడం లేదని కూడా అఖిలేశ్ వ్యాఖ్యానించారు. తాజాగా… మళ్లీ అఖిలేశ్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు తాను ప్రతిరోజూ చేసిన పనులపై రివ్యూ చేసుకొని హాయిగా నిద్రిస్తానని, కానీ సీఎం యోగికి మాత్రం రాత్రి నిద్రపట్టదని వ్యాఖ్యానించారు. ఓ విజన్ లేకుండానే బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్లూ పాలించిందని మండిపడ్డారు.
గత ఎన్నికల సందర్భంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ హామీని బీజేపీ నిలబెట్టుకుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడగానే విద్యుత్ బిల్లుల బకాయిలను 50 శాతం తగ్గిస్తామని ప్రకటిస్తున్నారని, ఇన్ని రోజులు ఏమైందని నిలదీశారు. పంజాబ్‌లో ప్రధానికి భద్రతా లోపం తలెత్తిందని బీజేపీ నానా గగ్గోలు చేస్తోందని, కానీ.. కేంద్రం ఈ మధ్యే కొందరి నేతల సెక్యూరిటీని ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. ప్రధాని ప్రాణాలే ప్రాణాలా? వారివి కావా? వారిది సెక్యూరిటీ కాదా? అంటూ అఖిలేశ్ మండిపడ్డారు.