UP Polls | సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పోటీ చేసే స్థానంపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఇప్పటికీ పార్టీ, అఖిలేశ్ కూడా డోలాయమాన స్థితిలోనే ఉండిపోతున్నారు. అయితే అఖిలేశ్ పోటీ చేసే స్థానంపై బుధవారం ఓ క్లారిటీ వచ్చినట్లే వచ్చింది. ఆజంగఢ్ నుంచి అఖిలేశ్ బరిలోకి దిగుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అదే ఫైనల్ అని కూడా ఓ వర్గం బాగా ప్రచారం చేసింది. తీరా చూస్తే… ఇప్పుడు ఆజంగఢ్ నుంచి కూడా బరిలోకి దిగడం లేదని తెలుస్తోంది. తాజాగా సంభల్ గున్నౌర్ నుంచి అఖిలేశ్ బరిలోకి దిగాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
సంభల్ గున్నౌర్ సమాజ్‌వాదీకి ఎప్పటి నుంచో కంచు కోటలా వుంటూ వస్తోంది. సమాజ్‌వాదీ మార్గదర్శకుడు, మాజీ సీఎం ములాయం యాదవ్ ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అఖిలేశ్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్, జావేద్ అలీఖాన్ కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. మరోవైపు ఇక్కడ దాదాపు 40 శాతం ముస్లింల జనాభా వుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో యాదవులు కూడా బలంగానే వున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పార్టీ వ్యూహకర్తలు అఖిలేశ్‌ను ఇక్కడి నుంచే బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారు.