ఉత్తరప్రదేశ్‌లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ బాబాయి శివపాల్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో దశ పోలింగ్‌లో భాగంగా 59 నియోజకవర్గాలు, 16 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తన భార్య డింపుల్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం యోగిపై విరుచుకుపడ్డారు.
ఈ ఐదేళ్లలో సీఎం యోగి చేసిందేమీ లేదని విమర్శించారు. సీఎం యోగి ఒక్క మంచి పని కూడా చేయలేదని మండిపడ్డారు. ఇక.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన విమర్శలపై కూడా స్పందించారు. ఆయనో మంత్రి అని,ఈ విషయం ఆయన్నే అడగాలన్నారు. ఒక్క ఫొటోనే ప్రామాణికంగా తీసుకుంటారా? డబ్బులు ఎగ్గొట్టిన పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలతో నేతలు దిగిన ఫొటోలూ ఉన్నాయి. నేను ఎంపీగా ఉన్న సమయంలో పాకిస్తాన్ జనరల్ ఆ తర్వాత ప్రధాని అయిన వ్యక్తి వచ్చారు. అప్పుడు బీజేపీ నేతలు ఆయన కాళ్లకు మొక్కడాన్ని చూశా అని అఖిలేశ్ పేర్కొన్నారు.
మరోవైపు అఖిలేశ్ పోటీ చేస్తున్న కర్హల్‌లోని భాగ్‌పూర్ ప్రాంతంలో ప్రజలను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని సమాజ్‌వాదీ ఆరోపించింది. భాగపూర్లోని బూత్ నెంబర్ 244,45 పోలింగ్ బూత్‌లలో ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని సమాజ్‌వాదీ ఆరోపించింది. పారదర్శకంగా, ఎలాంటి భయాలు లేకుండా ఓటింగ్ జరిగేలా చూడాలని సమాజ్‌వాదీ అధికారులను విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై పోలీసులు కూడా స్పందించారు. పోలింగ్ బూత్‌లో ఇబ్బందులు లేవని, పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోందని తెలిపారు.