Akash Prime | స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. లడఖ్ సెక్టార్లో 15వేల అడుగుల ఎత్తులో ఈ రక్షణ వ్యవస్థను డీఆర్డీవోతో కలిసి పరీక్షించింది భారత సైన్యం. ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు చాలా ఎత్తులో ఉన్న సమయంలోనూ వేగంగా కదిలే లక్ష్యాలపై ఆకాశ్ విజయవంతంగా దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం, చైనా విమానాలు, టర్కిష్ డ్రోన్లను ఉపయోగించి చేసిన వైమానిక దాడులను అడ్డుకోవడంలో కూడా ఈ వ్యవస్థ చాలా బాగా పనిచేసిందని రక్షణ అధికారులు తెలిపారు.
ఆకాశ్ ప్రైమ్ అనేది డీఆర్డీవో రూపొందించిన అధునాతనమై, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన స్మాల్ రేంట్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (SAM) వ్యవస్థ. ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్‌ను వైమానిక దాడుల నుంచి కీలకమైన ప్రాంతాలు, పాయింట్లను రక్షించేందుకు రూపొందించింది. ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్‌తో పోలిస్తే.. ఆకాశ్ ప్రైమ్‌లో మెరుగైన ఖచ్చితత్వం కోసం స్వదేశీ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సీకర్‌తో అమర్చారు. అంతేకాకుండా భారీ ఎత్తులో, తక్కువ ఉష్ణోగ్రత వాతావరణంలో ఖచ్చితత్వంతో పని చేస్తాయి. ఆకాష్ ప్రైమ్ సెప్టెంబర్ 2021లో ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో తొలిసారిగా పరీక్షించారు. ఆ సమయంలో శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని అడ్డగించి నాశనం చేసింది. ఆకాశ్ స్మాల్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్. ఆకాశ్ వెపన్ సిస్టమ్ గ్రూప్ మోడ్, అటానమస్ మోడ్‌లో బహుళ లక్ష్యాలను ఏకకాలంలో టార్గెట్ చేస్తుంది.