పుణె, నవంబర్ 22: మహారాష్ట్రలోని మాలెగావ్ నగర్ పంచాయత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే పట్టణానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థులను తిరస్కరిస్తే తాను కూడా తిరస్కరిస్తానని ఆయన హెచ్చరించారు. బారామతి తహసిల్‌లోని మాలెగావ్ నగర్ పంచాయత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అజిత్ పవార్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ మొత్తం 18 మంది ఎన్సీపీ అభ్యర్థులనే మీరు ఎన్నుకుంటే నిధుల కొరత రాకుండా చూసుకుంటానని అన్నారు.
మొత్తం 18 మందిని మా అభ్యర్థులనే ఎన్నుకోండి. మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. మీరు తిరస్కరిస్తే నేను కూడా తిరస్కరిస్తా. మీ దగ్గర ఓట్లు ఉన్నాయి. నా దగ్గర నిధులు ఉన్నాయి అని ఓటర్లను హెచ్చరించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) నాయకుడు అంబా దాస్ దాన్వే తీవ్ర అభ్యంతరం తెలిపారు.