ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఆ పార్టీ కీలక సమావేశానికి దూరంగా ఉన్నారు. ముంబైలో శుక్రవారం రోజంతా జరిగే కీలక పార్టీ సమావేశానికి తాను హాజరుకావడం లేదని ఆయన తెలిపారు. పూణేలో మీడియాతో మాట్లాడిన ఆయన అదే సమయంలో మరో కార్యక్రమానికి తాను హాజరు కావాల్సి ఉందన్నారు. దీంతో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదని చెప్పారు. అయితే పార్టీ సమావేశానికి దూరంగా ఉండటం అన్నది పార్టీని వీడుతున్నట్లు కాదని అన్నారు. ఇందులో ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదన్నారు.
మరోవైపు శుక్రవారం ఉదయం ముంబైలో ప్రారంభమైన ఎన్సీపీ సమావేశంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సాయంత్రం మాట్లాడనున్నారు. అయితే కీలకమైన ఈ సమావేశానికి అజిత్ పవార్ దూరంగా ఉండటంతో ఎన్సీపీని వీడేందుకు ఆయన సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్నది.
కాగా, అజిత్ పవార్ ఇటీవల కూడా పార్టీ సమావేశానికి, షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దీనికి ముందు ప్రధాని మోదీకి మద్దతుగా మాట్లాడారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వదంతులు వ్యాపించాయి. అయితే తన ఆరోగ్యం బాగోలేక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు మీడియాకు ఆయన వివరణ ఇచ్చారు.