(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : అజిత్ పవార్ 1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని డోలాయి ప్రవారా ప్రాంతంలో జన్మించారు. తండ్రి అనంత్‌రావ్ పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్‌కు అనంత్‌రావ్ పవార్ పెద్దన్న అవుతారు. బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్.. 23 ఏండ్ల వయసులోనే అంటే 1982లో తొలిసారిగా కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏండ్లపాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1991లో తొలిసారిగా బారామతి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అయితే, బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ సీటులో గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచే 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అజిత్ పవార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సునేత్ర పవార్ రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ సీఎంగా ఉన్నప్పుడు అజిత్ పవార్ తొలిసారిగా 2010లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత చవాన్ హయాంలో 2012లో రెండోసారి, 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో మూడోసారి, అదే ఏడాది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వంలో నాలుగో సారి డిప్యూటీ సీఎంగా పని చేశారు. 2022లో శరత్ పవార్‌తో విడిపోయి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమితో చేతులు కలిపి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఐదోసారి డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. ఈ సమయంలో అజిత్ పవార్ సీఎంగా బాధ్యతలు చేపడుతారని అంతా భావించారు. అయితే చివరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఆ అవకాశం దక్కింది.
ముంబై: అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీని నడిపే సమర్థవంతమైన నాయకుడు ఎవరన్న దానిపై మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ, ఆమెకు పార్టీని నడిపే గత అనుభవం లేదని విశ్లేషకులు అంటున్నారు. అజిత్ పవార్ పార్టీ శ్రేణులను ఎన్సీపీ (ఎస్పీ) అధినేత, అజిత్ పవార్ బాబాయ్ శరద్ పవార్ ముందుకు తీసుకెళ్లవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇద్దరు పవార్లు జట్టు కట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే, పవార్ పార్టీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలను వదులుకోవడానికి ఫడ్నవీస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని మరికొందరు అంటున్నారు. ఎన్సీపీ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీత్ తాత్కరే నేతృత్వంలో పవార్ పార్టీ ముందుకు వెళ్లొచ్చన్న అభిప్రాయాన్ని కూడా మరికొందరు వెలిబుచ్చుతున్నారు.