Ajit Pawar | శరద్ పవార్‌కు మరోసారి షాక్ తగలింది. అజిత్ పవార్ గ్రూపుదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ గురువారం తేల్చారు. 53 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు (41 మంది ) మద్దతు అజిత్ పవార్ వెంటే ఉన్నారని అన్నారు. అందుకే అజిత్ పవార్ గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న శరద్ పవార్ వర్గం డిమాండ్‌ను సైతం స్పీకర్ తిరస్కరించారు.
ఎన్సీపీలో జూలై 2వ తేదీన చీలక వచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. దీంతో శరద్ పవార్ వర్గం అజిత్ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. మరోవైపు శరద్ పవార్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటు వేసింది. ఎన్సీపీ ఎమ్మెల్యే అనర్హత కేసులో సరైన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో ఎన్సీపీకి సంబంధించిన అనర్హత పిటిషన్ పై జనవరి 31లోగా నిర్ణయం తీసుకోవాలని నర్వేకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై నర్వేకర్ ఫలితాలను ప్రకటించేందుకు సమయం పొడిగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. ఎట్టకేలకు గురువారం ఎన్సీపీలో చీలిక, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నర్వేకర్ తీర్పు ఇచ్చారు. కాగా, అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది.