AIUDF : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మన బిడ్డలపై ప్రతి చోటా జరుగుతుంటే ఇక వారు బయటకు ఎలా రాగలరని ఏఐయూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి రఫీకుల్ ఇస్లాం ప్రశ్నించారు.
సీబీఐ విచారణ చేపట్టి సత్వరమే దోషిని ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. దోషిని ఉరితీస్తేనే ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడే వారిలో వణుకు పుడుతుందని అన్నారు. ప్రతి రాష్ట్ర పోలీస్, హోం విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, అన్ని సంస్ధల్లో మహిళలు, యువతులు, చిన్నారుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కోల్కతా ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనపై సత్వర విచారణ చేపట్టి దోషిని ఉరితీస్తే తాము స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విపక్షాలు భగ్గుమన్నాయి.