Air Pollution | న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశంలో వాయు కాలుష్యం 2022లో 19.3 శాతం తగ్గింది. ఆ ఏడాది ప్రపంచంలో బంగ్లాదేశ్ తర్వాత భారత్‌లోనే వాయు కాలుష్యం అధికంగా తగ్గిందని, దీంతో భారతీయుల సగటు ఆయుర్దాయం ఏడాదిపాటు పెరిగిందని షికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఎపిక్) తాజాగా విడుదల చేసిన ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్-2024’ నివేదికలో వెల్లడించింది.
2021తో పోలిస్తే 2022లో భారత్‌లో కాలుష్య రేణువుల (పీఎం 2.5) స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 9 మైక్రో గ్రాములు తగ్గాయని, ముఖ్యంగా బెంగాల్, జార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో పీఎం 2.5 స్థాయిలు గణనీయంగా క్యూబిక్ మీటర్‌కు 20 మైక్రో గ్రాముల మేరకు క్షీణించాయని స్పష్టం చేసింది. భారత్‌లో ఇంకా 42 శాతం మంది ప్రజలు జాతీయ ప్రమాణం (క్యూబిక్ మీటర్‌కు 40 మైక్రో గ్రాములు) కంటే పీఎం 2.5 స్థాయి అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్టు తెలిపింది.