Supreme Court | పంటల వ్యవర్థాలను కాల్చడం వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏంటో చెప్పాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వాయు కాలుష్యంపై ఈ నెల 27న విచారణ జరుపనున్నది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM)కు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ శివారులోని రాష్ట్రాల్లో పంటల వ్యవర్థాల దహనం మొదలైందంటూ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాయు కాలుష్యాన్ని నివారించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో కమిషన్ నుంచి వివరణ కోరాలని ఆయన కోర్టును కోరారు. ఈ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నలకు శుక్రవారంలోగా సమాధానం చెప్పాలని ధర్మాసనం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భాటిని జస్టిస్ ఓకా సూచించారు.
ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యంపై పర్యావరణవేత్త ఎంసీ మెహతా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై ఈ నెల 27న సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపనున్నది. ఏటా చలికాలంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చివేయడం ఓ కారణమని సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. ఢిల్లీతో పాటు రాజధాని రీజియన్‌లోని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులు సిబ్బంది కొరతతో పనికిరావన్న సుప్రీంకోర్టు.. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రతిపాదించాలని కమిషన్‌ను కోరింది. అదే సమయంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి ఎలాంటి ప్రాతినిథ్యం లేకపోవడంతో కమిషన్ ద్వారా ఏర్పాటు చేయాల్సిన భద్రత, అమలుపై ఉప సంఘం ఎలా పని చేస్తుందంటూ కోర్టు ఆశ్చర్య వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30లోగా ఖాళీగా ఉన్న పోర్టులను తక్షణం భర్తీ చేయాలని ఎన్సీఆర్లోని ఐదు రాష్ట్రాలను ఆదేశించింది.