Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కోరల్లో చిక్కుకున్నది. దీపావళి నుంచి వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు వాయు కాలుష్యంతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చెస్ట్ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉత్తరభారతంలోని అన్ని రాష్ట్రాలకు దాదాపు 33 పేజీలతో కూడిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ఆరోగ్య వ్యవస్థను అప్రమత్తం చేస్తూ.. కాలుష్యంతో శ్వాసకోశ, గుండెజబ్బులు పెరుగుతున్నాయని చెప్పింది. అందువల్ల ఆసుపత్రులను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని చెప్పింది. వాయు నాణ్యత క్షీణిస్తుందని.. ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాల్‌గా మారిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసేందుకు అందరూ కలిసి పని చేయాలన్నారు. ఛాతీ క్లినిక్‌లో కాలుష్యంతో ప్రభావితమైన రోగులను ఎలా నివేదించాలి? సమస్యలను ఎలా నిర్వహించాలి? అన్నదానిపై ఆరోగ్యమంత్రిత్వశాఖ మార్గదర్శకాల్లో స్పెషల్‌గా ఫార్మాట్‌ను ఇచ్చింది. ప్రతిరోజూ ఆసుపత్రుల నుంచి జిల్లాలకు.. అక్కడి నుంచి ఢిల్లీకి పంపడం తప్పనిసరని పేర్కొంది.
ఈ సందర్భంగా నిర్మాణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించాలని ఆదేశించింది. 5వ తరగతి వరకు ఆన్లైన్లోనే జరగాలని చెప్పింది. నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము లేవకుండా నీరు చల్లడం, కవర్లతో కప్పివేయడం, కార్మికులకు కిట్లు, మాస్క్‌లు అందించాలని కేంద్రం ఆదేశించింది. నిర్మాణరంగంలోని కార్మికులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించడంతో పాటు శిక్షణ ఇవ్వాలని చెప్పింది. అదే సమయంలో రాష్ట్రాలు, జిల్లాల టాస్క్‌ఫోర్స్‌లను యాక్టివ్ చేయాలని చెప్పింది. పర్యావరణ, రవాణా, పట్టణాభివృద్ధి, మహిళాశిశు అభివృద్ధి, కార్మికశాఖలతో సమన్వయం చేయాలని కేంద్ర కార్యదర్శి లేఖనలో పేర్కొన్నారు. అలాగే, ఢిల్లీ-ఎన్సీఆర్లో ఇప్పటికే అమలు చేయడిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)ని ఖచ్చితత్వంతో అమలు చేయాలని చెప్పింది. వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు మాత్రమే కాకుండా గుండె, మెదడు, నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పలు సూచనలు చేసింది. కాలుష్యం నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళ్లలో బయటకు వెళ్లడం, రన్నింగ్ చేయడం, వాకింగ్ తదితర శారీరక వ్యాయామాలు మానుకోవాలని చూపింది. అలాగే, ఉదయం, సాయంత్రం వేళల్లో ఇండ్ల కిటికీలు, తలుపులు మూసివేయాలని.. తెరవకూడదని సూచించింది.