న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ బాధ్యతలు స్వీకరించారు. (Air Marshal Nagesh Kapoor) నాలుగు దశాబ్దాల పాటు దేశానికి విశిష్ట సేవలందించి బుధవారం పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ నరమదేశ్వర్ తివారీ స్థానంలో ఆయన నియమితులయ్యారు. గురువారం ఢిల్లీలోని వాయు భవన్లో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ట్గా ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వీర జవాన్లకు నివాళులర్పించారు.
కాగా, ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. 1985 డిసెంబర్లో ఆయన పాస్అవుట్ అయ్యారు. 1986 డిసెంబర్ 6న వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ బ్రాంచ్ ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు. నిష్ణాతుడైన ఫైటర్ పైలట్, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, ఫైటర్ కంబాట్ లీడర్‌గా ఆయన గుర్తింపు పొందారు. మిగ్-21, మిగ్-29 విమానాలతో సహా పలు యుద్ధ విమానాలను నడిపారు.
మరోవైపు ఐఏఎఫ్‌లో 39 సంవత్సరాలకు పైగా సేవలందించిన ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ పలు ఉన్నత పదవులు చేపట్టారు. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా నియామానికి ముందు సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఆయన పనిచేశారు. 2008లో వాయు సేన పతకం, 2022లో అతి విశిష్ట సేవా పతకం, 2025లో పరమ విశిష్ట సేవా పతకం, సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకంతో పాటు రాష్ట్రపతి అవార్డులు కూడా ఆయనకు లభించాయి.
Also Read:
Drugs Supplying To Students | విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా.. డాక్టర్ సహా ఏడుగురు అరెస్ట్
Watch: న్యూఇయర్ వేడుకల్లో తాగి హంగామా చేసిన మహిళలు.. వీడియోలు వైరల్