విమానం కూలిపోయే ముందు పైలట్ల నుంచి ఏటీసీకి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ‘మేడే కాల్’ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆ కాల్‌ను రిసీవ్ చేసుకొన్న ఏటీసీ బృందం తిరిగి పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. ఇది జరిగిన సెకండ్ల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టు సమీపంలో విమానం కూలిపోయి దట్టమైన పొగలు వ్యాపించినట్టు తెలిపారు.
‘మేడే కాల్’ అనేది డిస్ట్రెస్ కాల్. అత్యవసర పరిస్థితుల్లో విమానాల్లో, నౌకల్లో దీన్ని వాడుతారు. తాము అత్యవసర ప్రమాద స్థితిలో చిక్కుకొన్నామని, వెంటనే సాయం కావాలని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత అధికారులకు పైలట్లు తెలియజేయడానికి ఇది సాయపడుతుంది. ఎమర్జెన్సీ సమయాల్లో మేడే అనే పదాన్ని పైలట్లు మూడుసార్లు వాడుతారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మైడెర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి మేడే అనే పదం వచ్చిందని, దీనికి సాయం చేయండి అని అర్థం అని వాళ్లు చెప్తున్నారు.
ఎయిరిండియా విమాన ప్రమాదం ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చ అంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ప్రమాదానికి గల అసలు కారణం మాత్రం ఇంకా బయటకురాలేదు. ఎయిర్‌క్రాఫ్ట్‌లోని బ్లాక్‌బాక్స్ బయటపడితేనే ప్రమాదానికి గల అసలు కారణం తెలుస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఏమిటీ బ్లాక్‌బాక్స్ అన్న చర్చ మొదలైంది. ప్రమాదానికి ముందు విమానంలో జరిగే సంఘటనలను రికార్డ్ చేసేదే బ్లాక్‌బాక్స్. సాధారణంగా ప్రతీ విమానాల్లో రెండు బ్లాక్‌బాక్స్‌లు ఉంటాయి. ఒకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, రెండోది ఫ్లైట్ డాటా రికార్డర్. విమానం కూలిపోయినా, కాలిపోయినా, నీటిలో మునిగిపోయినా బ్లాక్బాక్స్కు ఏమీకాకుండా దీన్ని ధృడమైన స్టీల్ లేదా టైటానియంతో తయారు చేస్తారు.