Air India | ఇటీవల గతకొంతకాలంగా ఎయిర్ ఇండియా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తరుచూ విమానాల్లో సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్నాయి. అదే సమయంలో ఏసీలు పని చేయక.. సరైన సహాయం అందక ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. తాజాగా దుబాయి నుంచి జైపూర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇంటర్నేషనల్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ప్రయాణికులను దాదాపు ఐదుగంటలు విమానంలోనే కూర్చుండబెట్టారు. ఈ సమయంలో ఎయిర్ కండిషనర్ సైతం ఆన్ చేయలేదు. ప్రయాణికులకు నీరు, ఆహారం అందించలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఘటన జూన్ 13న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-196 దుబాయి నుంచి జైపూర్‌కు రాత్రి రాత్రి 7.25 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ, సాంకేతిక లోపంతో విమానం సకాలంలో బయలుదేరలేదు. దాదాపు 150 మందికిపైగా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. విమానంలో ఏసీలను సైతం నిలిపివేయడంతో ఉక్కపోతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఐదు గంటల పాటు విమానంలోనే చిక్కుకుపోయినా కనీసం తాగేందుకు నీరు ఇవ్వలేదని.. తినేందుకు ఏమీ ఇవ్వలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా తీవ్రమైన భద్రతా లోపమని ఆరోపించారు. ఇక విమానంలో సమస్యలను సరిదిద్దిన తర్వాత తెల్లవారు జామున 12.44గంటలకు దుబాయి నుంచి బయలుదేరి.. జూన్ 13-14 తేదీల మధ్య రాత్రి 2.44 గంటలకు విమానం జైపూర్ విమానాశ్రయానికి చేరింది.
విమానం ఆలస్యం కారణంగా మానసిక, శారీరకంగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటూ మండిపడ్డారు. విమానంలో ఉక్కపోతతో ఇబ్బందిపడ్డామని.. పదే పదే సహాయం చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదని.. సిబ్బంది నుంచి స్పందన కరువైందని ప్రయాణికులు ఆరోపించారు. సాంకేతిక లోపంతో ఏసీలు పని చేయకపోయినా.. కనీసం సమాచారం ఇవ్వలేదంటూ ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన రెండు నిమిషాల్లోనే కూలిపోయింది. విమానం వైద్య కళాశాల హాస్టల్‌ను భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పటి వరకు విమానం కూలిపోయిన ఘటనలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.