Air India | భారత్ – పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు తెలిపింది. మే 15వ తేదీ వరకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు ప్రకటించింది. జమ్ము, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొంది.
మే 15వ తేదీ లోపు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్న కస్టమర్లకు రీషెడ్యూలింగ్ ఛార్జీలపై ఒకసారి మినహాయింపు లేదా టికెట్ రద్దుకు పూర్తి నగదు వాపసు అందిస్తామని ఎయిరిండియా తెలిపింది. మరిన్ని వివరాలకు 011 – 69329333, 011 – 69329999 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 24 ఎయిర్పోర్టులను కేంద్రం మూసివేసింది. మే 14వ తేదీ వరకు ఎయిర్పోర్టులు మూసివేసి ఉంటాయని తెలిపింది. చండీగఢ్, అమృత్సర్, లుథియానా, భుంటార్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్కోట్, శ్రీనగర్, జమ్మూ, భిక్నేర్, లేహ్, పోర్బందర్, ఇతర నగరాల్లోని ఎయిర్పోర్టులను మే 10 తేదీ వరకు మూసివేస్తున్నామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తొలుత ప్రకటించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ గడువును మే 14వ తేదీ వరకు పొడిగించింది.