బెంగళూరు: బ్రేకప్ కోసం బాయ్ ఫ్రెండ్‌ను కలిసిన ఎయిర్ హోస్టెస్, ఎత్తైన బిల్డింగ్ పైనుంచి కిందపడి మరణించింది (Air hostess falls to death). దీంతో ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల మహిళ ఒక అంతర్జాతీయ ఎయిర్‌లైన్ కంపెనీలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నది. కేరళకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. గత ఆరు నెలలుగా వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వారిద్దరూ తరచుగా గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
కాగా, బ్రేకప్‌కు ముందు ప్రియుడ్ని కలిసేందుకు ఆ ఎయిర్ హోస్టెస్ దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చింది. శుక్రవారం రాత్రి వారిద్దరూ కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు కోరమంగళ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం, గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ నాలుగో అంతస్తు పైనుంచి కింద పడి ఆమె చనిపోయింది.
మరోవైపు ప్రియుడు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో వారు అక్కడకు వచ్చి ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించి ఆ మేరకు కేసు నమోదు చేశారు. అయితే నాలుగో అంతస్తు పైనుంచి ఆమె దూకడం సాధ్యం కాదని పోలీసులు భావించారు. దీంతో ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేసి హత్య కేసుగా మార్చారు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రియురాలి మరణంపై ప్రశ్నిస్తున్నారు.