భారీగా బడ్జెట్ కేటాయిస్తూ రక్షణ శాఖను బలోపేతం చేస్తున్నామని మోదీ సర్కారు కొట్టుకుంటున్న డప్పు అంతా ఉత్తదేనని తేలిపోయింది. ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన కాంట్రాక్టులపై సంతకాలు చేస్తున్నామే తప్ప ఏ ఒక్కటీ తమకు చేరడం లేదని స్వయంగా రక్షణ మంత్రి సమక్షంలోనే వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర సర్కారు డొల్ల తనాన్ని బట్టబయలు చేశాయి.
Amar Preet Singh | న్యూఢిల్లీ, మే 29: రక్షణశాఖకు భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నామని, బలోపేతం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నదని తేలిపోయింది. వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన కాంట్రాక్టులపై సంతకాలు చేస్తున్నామే తప్ప, అవి తమకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధాల సరఫరాలో ఆలస్యం ఒక జాడ్యంగా మారిపోయిందన్నారు. ఏకంగా రక్షణ శాఖ మంత్రి సమక్షంలోనే అమర్ ప్రీత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటన దేశ చరిత్రలోనే మొదటిసారి అని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ఆత్మనిర్భర్ భారత్ పేరుతో కేంద్రం చేస్తున్నదంతా హడావుడేనని తేలిపోయిందన్నారు.
గురువారం ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాయుసేన అధిపతి మాట్లాడుతూ.. ‘సమయానికి సరఫరా చేయడమనేది పెద్ద సమస్యగా మారింది. నాకు తెలిసి ఒక్క ప్రాజెక్టు కూడా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు’ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి సరఫరా చేయలేనప్పుడు హామీ ఎందుకివ్వాలి? అని ప్రశ్నించారు.
ముఖ్యంగా దేశీయంగా తయారయ్యే ప్రాజెక్టులు మరింత ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ఇందుకు లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్ఏటీ) ప్రోగ్రామ్ను ఉదాహరణగా పేర్కొన్నారు. తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాల తయారీకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో 2021లో రూ.48 వేల కోట్లకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 2024 మార్చి నుంచి విమానాలు డెలివరీ చేయాల్సి ఉన్నదన్నారు. 83 విమానాలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటివరకు ఒక్కటి కూడా తమ చేతికి అందలేదన్నారు. తేజస్ ఎంకే-2 నమూనా ఇంకా సిద్ధం కాలేదన్నారు.
‘దేశీయంగా ఉత్పత్తి గురించే కాదు, స్వదేశీ డిజైన్లపైనా చర్చ జరగాలి. భద్రతా బలగాలకు, ఆయుధ కంపెనీలకు మధ్య సమన్వయం ఉండాలి. ఒకసారి ఒప్పందం చేసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. సమయానికి డెలివరీ ఇవ్వాలి’ అని ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ఆయుధాల తయారీలో ప్రైవేట్ రంగ సంస్థలను కూడా భాగస్వాములు చేయడం గొప్ప విషయమన్నారు.
తద్వారా భవిష్యత్తులో ఆయుధ తయారీ రంగం మరింత వేగం పుంజుకుంటుందన్నారు. అయితే.. ఆయుధ వ్యవస్థల సరఫరాపై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదని నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది అక్టోబర్లో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. టెక్నాలజీ విషయంలో ఒకప్పుడు మనం చైనా కన్నా ముందుండేవాళ్లమని, ఇప్పుడు వెనుకబడ్డామని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైతం హెచ్ఏఎల్ సంస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.