Uttarkashi Tunnel | న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకుని, 17 రోజుల తర్వాత బయటపడ్డ కార్మికుల మానసిక స్థితిపై ఎయిమ్స్-రిషికేశ్ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మూడోవంతు కార్మికులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారని, చివరికి కార్మికుల్లో నిద్ర సమయం పూర్తిగా తగ్గిపోయిందని నివేదిక తెలిపింది. నిర్మాణంలో ఉన్న ఉత్తరకాశీ టన్నెల్ 2023 నవంబర్ 12న కుప్పకూలింది.
సొరంగం లోపల 40 మందికిపైగా కార్మికులు 17 రోజులపాటు చిక్కుకుపోయారు. ఆ బాధితుల్లో తలెత్తిన మానసిక, నిద్ర సమస్యలు, ఇతర విపత్తుల బాధితులతో పోల్చితే భిన్నంగా ఉన్నాయని నిపుణుల బృందం తేల్చింది. వీరి నివేదికలోని అంశాలు ‘జర్నల్ స్లీప్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి. సొరంగంలో చిక్కుకున్న సమయంలో రోజువారీ దినచర్య, ఆందోళన, నిరాశ, నిద్ర.. తదితర అంశాలపై 33 మంది కార్మికులను వైద్య నిపుణులు ఇంటర్వ్యూ చేసి.. ఈ నివేదిక రూపొందించారు. తొలి రోజుల్లో ఆందోళనతోపాటు బయటపడతామనే ఆశ ఉండేదని బాధితులు చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్దీ దిక్కుతోచని స్థితికి చేరుకున్నట్టు, నిద్ర కరువైనట్టు తెలిపారు.