న్యూఢిల్లీ: సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ (సీసీఈఈఎం) డిగ్రీ, డిప్లొమా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ‘యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనీషియేటివ్ (యశస్వి) పేరుతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిని శుక్రవారం ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారామ్ ప్రారంభించారు.
మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాలంటే ఇంజినీరింగ్‌లోని ఈ బ్రాంచ్‌లు చాలా ముఖ్యమైనవని సీతారామ్ చెప్పారు. ఏఐసీటీఈ ఆమోదం గల టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లలోని ఈ బ్రాంచ్‌ల్లో చేరే ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. డిగ్రీ విద్యార్థులకు సంవత్సరానికి రూ.18,000 చొప్పున గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు, డిప్లమో విద్యార్థులకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున గరిష్ఠంగా మూడేళ్ల వరకు ఉపకార వేతనం ఇస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం 2,500 మంది డిగ్రీ విద్యార్థులకు, 2,500 మంది డిప్లమో విద్యార్థులకు ఈ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు.