చెన్నై: తమిళనాడులో ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, దాని మిత్రపక్షం బీజేపీ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈ నెల 27న జరుగనున్నది. ప్రస్తుతం అన్నాడీఎంకే చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఎడప్పాడి కే పళనిసామి (ఈపీఎస్) ఇక్కడ పోటీ చేస్తున్నారు. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తొలగించిన తర్వాత తన పవర్‌ను నిరూపించుకోవాలని పళనిసామి భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్ నుంచి బీజేపీని తొలగించారు. బీజేపీ గుర్తు, ప్రధాని మోదీ, ఇతర నేతల ఫొటోలు అందులో లేవు. అలాగే బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కాకుండా ‘నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ అని పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ స్థానం గురించి ఆ పార్టీ తెలుసుకోవాలని అన్నాడీఎంకే నేత ఒకరు తెలిపారు. అందుకే పార్టీ చీఫ్ పళనిసామి ఈ మేరకు స్పష్టత ఇచ్చారని అన్నారు.
కాగా, అన్నాడీఎంకే పోస్టర్లో బీజేపీ ప్రస్తావన లేకపోవడంపై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై స్పందించారు. దీనిపై తగిన సమాధానం ఇస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి పేరైన ఎన్డీఏను గంట తర్వాత ఆ పోస్టర్లో పునరుద్ధరించారు.
మరోవైపు జయలలిత మరణాంతరం అన్నాడీఎంకేపై అధిపత్యం చెలాయించిన పళనిసామి, పన్నీర్ సెల్వం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేసి ఓటమిచెందారు. తమిళనాడులో బీజేపీకి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అలాగే పళనిసామి, పన్నీర్ సెల్వం మధ్య విభేదాలకు బీజేపీ కారణమని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీని దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.