MK Stalin : తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) నియామకానికి సంబంధించిన వార్తలపై ఏఐఏడీఎంకే స్పందించింది. ఉదయనిధి స్టాలిన్ను డిప్యూటీ సీఎంగా చేస్తే తమిళనాడులో డీఎంకే శకం అంతమవుతుందనే సంకేతాలు పంపినట్టేనని ఏఐఏడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్ పేర్కొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి డీఎంకే వివిధ వర్గాలుగా చీలుతుందని, ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకరిద్దరు సీనియర్ నేతలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తారని ఆయన జోస్యం చెప్పారు.
ఎన్నికలకు ముందు తన కుమారుడు కానీ అల్లుడు కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం లేదని అప్పట్లో ఎంకే స్టాలిన్ (MK Stalin) చెప్పిన విషయాన్ని సత్యన్ గుర్తుచేశారు. ఆపై తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఉదయనిధి స్టాలిన్ను సీఎం అభ్యర్ధిగా ముందుకు తెచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని ఏఐఏడీఎంకే నేత పేర్కొన్నారు.
ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేస్తే తమిళనాడులో డీఎంకే శకం ముగిసినట్టేనని సత్యన్ స్పష్టం చేశారు. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు డిప్యూటీ సీఎం (deputy Chief Minister) పగ్గాలు అప్పగించే సమయం ఆసన్నమైనట్లు తెలిసింది. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉందని అధికార డీఎంకే వర్గాలు బుధవారం వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
Read More :