ముంబై: ముంబై నగర పాలిక ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్న వేళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైని బంగ్లా దేశీయులు, రొహింగ్యాలు లేని నగరంగా చేస్తామని ప్రకటించారు. వారిని గుర్తించి, దేశ బహిష్కరణ చేయడానికి ఏఐ టూల్‌ను రూపొందించామని.. ఇది ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని ఆయన చెప్పారు.
గత ఏడాదిన్నర కాలంలో తమ అధికారులు, పోలీసులు అత్యధిక సంఖ్యలో బంగ్లా దేశీయులు, రొహింగ్యాలను దేశ బహిష్కరణ చేశారని ఆయన వెల్లడించారు. తమ కూటమి ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై విపక్ష ఎంవీఏ కూటమి స్పందిస్తూ గత దశాబ్ద కాలంగా వారి ఏరివేతపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ముంబైలో ఎంత మంది బంగ్లా దేశీయులు, రొహింగ్యాలు ఉన్నారో గణాంకాలు విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.