హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): పంటల కొనుగోళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వినియోగించాలని మార్కెటింగ్‌శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మారెటింగ్శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో అత్యాధునిక మోడల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో పంటల సాగు దశ నుంచి క్రయవిక్రయాలు, ఉత్పత్తులు, ధరల తీరు తెన్నులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. యార్డుల్లో నిల్వ, గ్రేడింగ్ సౌకర్యాలు పరిషారానికి ఉద్యాన వర్సిటీ ఇటీవలే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
దీంతో రాష్ట్రంలోని అన్ని పంటల భూములను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానంతో మ్యాపింగ్ చేసి, జియోట్యాగింగ్ చేయనున్నారు. తద్వారా ఏ ప్రాంతంలో ఏ రైతు ఏపంట వేశారనే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వాతావరణ స్థితిగతులపై ఈ కేంద్రం వ్యవసాయశాఖకు ముందస్తు సమాచారం తెలియజేస్తుంది. తద్వారా విత్తనాల పంపిణీ, పంట కోత సమయాలు, ఎరువుల లభ్యత, తెగుళ్లు-నివారణ వంటి అంశాలపై రైతులకు మార్గనిర్దేశం చేస్తారు. పంట కోతల అనంతరం నిల్వ సదుపాయాలు, శుద్ధి, గ్రేడింగ్, ధరల వంటి వాటిపై సమాచారాన్ని అందిస్తారు.