న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ భారీ టెక్ కంపెనీల అధినేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 24న ప్రసారమైన ‘వన్ డెసిషన్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, పెద్ద కంపెనీల్లోని చాలా మంది ప్రముఖులు ఏఐ వల్ల జరిగే నష్టాల గురించి బహిరంగంగా తక్కువ చేసి చెప్తున్నారని తెలిపారు. గూగుల్ కంపెనీలోని టాప్ ఏఐ ల్యాబ్ గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసబిస్ మాత్రమే దీనికి మినహాయింపు అని చెప్పారు. ఏఐ వల్ల జరిగే నష్టాల గురించి వాస్తవంగా అర్థం చేసుకున్నది డెమిస్ అని చెప్పారు. ఏఐని నియంత్రించే ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ వంటివారు వ్యాపార, రాజకీయ అధికారాలను ఉపయోగించుకునే వ్యక్తులని వ్యాఖ్యానించారు. డెమిస్ హసబిస్ నోబెల్ బహుమతి గ్రహీత. శాస్త్రవేత్తలు, విద్యావేత్తల నేతృత్వంలో ఏఐ ఉండాలని ఆయన చాలా కాలం నుంచి చెప్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన మాట్లాడుతూ, ఏఐ భవిష్యత్తులో తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. శక్తిమంతమైన ఏఐ సిస్టమ్స్‌ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. ఏఐని క్రమబద్ధీకరించేందుకు అంతర్జాతీయ బృందం అవసరమని చెప్పారు. బ్రిటన్‌లో 2010లో ఏర్పాటైన డీప్‌మైండ్‌కు డెమిస్ సహ వ్యవస్థాపకుడు. ఆయన 2014లో దీనిని 650 మిలియన్ డాలర్లకు గూగుల్‌కు అమ్మేశారు. ఏఐ ఎథిక్స్ బోర్డును ఏర్పాటు చేస్తామని గూగుల్ హామీ ఇచ్చిన తర్వాతే ఆయన దానిని విక్రయించారు. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ వంటి అత్యాధునిక ఏఐని అభివృద్ధి చేయడం కోసం డీప్‌మైండ్ కృషి చేస్తుంది. ప్రజలకు, శాస్త్రవేత్తలకు సురక్షితంగా, నైతిక విధానంలో సహాయపడే ఏఐని సృష్టించాలనేది దీని లక్ష్యం.