అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 265 మందిని బలిగొన్న విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరిశీలించి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. శుక్రవారం ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ నేరుగా విమానం కూలిపోయిన ప్రదేశానికి వెళ్లారు.
ఘటనా స్థలిని 20 నిమిషాల సేపు ఆయన పరిశీలించారు. మెడికల్ కాలేజీ హాస్టల్, మెస్సుపై విమానం కూలిపోయిన వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు, గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి ప్రధానికి వివరించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానను సందర్శించిన మోదీ ప్రమాదంలో ఏకైక మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేశ్‌ని పరామర్శించారు.