నింగిని ముద్దాడబోతున్నామన్న ఆనందంలో పైనున్న విమానంలోని ప్రయాణికులు! వేడి వేడి కిచిడీ రైస్ తిందామని కింద హాస్టల్లో సిద్ధమైన విద్యార్థులు! రెప్పపాటులో వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. విమానయానం.. విషాద గమ్యంగా మారింది. విమానం కుప్పకూలడంతో ఆ శకలాలు.. కింద భోజనానికి సిద్ధమైన వైద్య విద్యార్థులపై నిప్పుల వర్షంగా కురిశాయి. ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఘోర విషాదాల్లో ఒకటిగా చెప్తున్న ఈ దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులు, 24 మందికి పైగా స్థానికులు మృత్యుఒడికి చేరారు.
గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే సాంకేతిక సమస్యతో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 265 మంది దుర్మరణం చెందారు. 61 మంది విదేశీ ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదవార్తతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది.
Ahmedabad Plane Crash | హైదరాబాద్, జూన్ 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకొన్నది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయాణికులు సహా మొత్తం 265 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానాశ్రయం సమీపంలోని మేఘానీ నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. మధ్యా హ్నం హాస్టల్లో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులపై విమాన శకలాలు పడ్డట్టు పేర్కొన్నారు. దీంతో నలుగురు మెడికోలు, వైద్యుడి భార్య మృతిచెందారు.
మరో ఐదుగురు గల్లంతయ్యారు. పలువురు స్థానికులు మృతిచెందారు. విమాన ప్రమాదం నేపథ్యంలో సిటీ సివిల్ దవాఖానకు 265 మృతదేహాలు చేరుకున్నట్లు తమకు సమాచారం అందిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కనన్ దేశాయ్ మీడియాకు చెప్పారు. అయితే, విమాన ప్రమాద మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించవలసి ఉంది. విమాన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అహ్మదాబాద్‌లోని సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్‌లోని గాట్విక్‌కు గురువారం మధ్యాహ్నం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం (ఫ్లైట్ నంబర్ ఏఐ-171) ప్రయాణమైంది. డీజీసీఏ ప్రకటన ప్రకారం.. 242 మందితో కూడిన ఈ విమానం రన్‌వే 23 నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు టేకాఫ్ అయ్యింది. అయితే, టేకాఫ్ అయిన 50 సెకండ్లలో 825 అడుగుల ఎత్తు వరకూ వెళ్లిన విమానం.. ఉన్నట్టుండి 625 అడుగుల ఎత్తుకు దిగిపోయింది. ఈ సమయంలోనే గ్రౌండ్ స్టేషన్ నుంచి సిగ్నల్స్‌ను విమానం కోల్పోయింది. ఈ క్రమంలో పూర్తిగా కిందకు దిగిపోయిన విమానం చెట్టుకు ఢీకొని అనంతరం బీజే మెడికల్ హాస్టల్ భవనంతో పాటు నిర్మాణంలో ఉన్న మరో భవనంపై కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.
విమానం కూలిపోగానే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, మంటలతో భయానకంగా మారిపోయింది. విమానం కూలిన శబ్దాన్ని వినగానే ‘భూకంపం వచ్చిందా?’ అని తాము భయపడిపోయామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 బీఎస్ఎఫ్ యూనిట్లు, పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. విమానంలోని ఇద్దరు పైలట్లు, పది మంది క్యాబిన్ సిబ్బంది సహా మొత్తంగా 241 మంది ప్రయాణికులు కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. విమాన శకలాలు పడటంతో 20 మందికిపైగా మెడికోలు, స్థానికులు మరణించినట్టు సమాచారం. హాస్టల్లోని క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య చికిత్స అందించడానికి గ్రీన్ కారిడార్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం
1.39 గంటలు: విమానం టేకాఫ్
1.39.50 గంటలు: 825 అడుగుల ఎత్తులోకి విమానం
1.40 గంటలు: 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ మిస్సింగ్
1.41 గంటలు: చెట్టును తాకి బిల్డింగ్‌లపై కుప్పకూలిన విమానం
ఎత్తు: భూమికి 625 అడుగులు
వేగం: 174 నాట్స్ (గంటకు 322 కిలోమీటర్లు)
ఇంధనం: 1.25 లక్షల లీటర్లు
పౌరవిమానయానశాఖ- 011-24610843, 9650391859
గుజరాత్ ప్రభుత్వం 079-232-51900, 9978405304
ఎయిరిండియా-1800 5691 444
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 011-24610843, 9650391859, 9974111327
యూకే గవర్న్మెంట్ 020-7008 5000
విమాన ప్రమాదం నేపథ్యంలో సర్దార్ వల్లభ్‌భాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును మూడు గంటల పాటు తాత్కాలికంగా మూసివేశారు. పలు విమానాలను రద్దు చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత విమానాశ్రయాన్ని తిరిగి తెరిచి విమాన సేవలను పునరుద్ధరించారు.
విమానంలో మొత్తం ఉన్నవారు 242
పైలట్లు: 2
క్యాబిన్ సిబ్బంది : 10
ప్రయాణికులు: 230
భారతీయులు169
బ్రిటిషర్లు 53
పోర్చుగీసువారు-7, కెనడీయులు-1