న్యూఢిల్లీ/ తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ నాయకుడు పీసీ జార్జ్ బీజేపీలో చేరారు. (PC George joins BJP) తన పార్టీ అయిన కేరళ జనపక్షం (సెక్యులర్)ను బీజేపీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, వీ మురళీధరన్, బీజేపీ సీనియర్ నేతలు ప్రకాశ్ జవదేకర్, అనిల్ ఆంటోనీ తదితరులు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పీసీ జార్జ్‌కు స్వాగతం పలికారు. అనంతరం పీసీ జార్జ్‌తోపాటు ఆయన కుమారుడు, కొట్టాయం జిల్లా పంచాయతీ సభ్యుడు షాన్ జార్జ్ కూడా బీజేపీలో చేరారు.
కాగా, కేరళలోని చర్చిల ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పీసీ జార్జ్ తెలిపారు. కేరళ జనపక్షం (సెక్యులర్) పార్టీని బీజేపీలో విలీనం చేయడం గురించి రెండు నెలలుగా అంతర్గతంగా చర్చించినట్లు చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలా వద్దా అన్నది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు.
మరోవైపు ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వంపై పీసీ జార్జ్ మండిపడ్డారు. ‘కేరళను యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మాత్రమే పాలిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. రాష్ట్రం పూర్తిగా పేదరికంలో ఉంది. ప్రజలు కేరళ నుంచి పారిపోతున్నారు. ఈ ఏడాది సుమారు 85,000 మంది విదేశాలకు వెళ్లారు. బీజేపీ అభ్యర్థిని ఓడిచేందుకు యూడీఎఫ్‌కు ఎల్డీఎఫ్, ఎల్డీఎఫ్కు యూడీఎఫ్ ఓటు వేస్తారు. చాలా ఏళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోంది. తిరువనంతపురం, కాసర్గోడ్లో చివరిసారి జరిగింది. ఇది అంతం కావాలి. ప్రధాని నరేంద్ర మోదీ దయతో మాత్రమే కేరళను రక్షించవచ్చు’ అని అన్నారు.
కాగా, పీసీ జార్జ్.. పూంజార్ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో కేరళ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (సెక్యులర్), కేరళ కాంగ్రెస్ (ఎం) వంటి పలు పార్టీలకు ఆయన ప్రాతినిధ్యం వహించడంతో పాటు స్వతంత్ర అభ్యర్థిగాను పోటీ చేశారు.