పనాజీ : ఫిబ్రవరి 14న గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్రైస్తవ ఎమ్మెల్యేలు కాషాయ పార్టీని వీడుతుండటం బీజేపీలో గుబులు రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దీటైన పోటీకి పాలక పార్టీ సమాయాత్తమవుతున్నా బీజేపీ టికెట్‌పై తమ నియోజకవర్గాల్లో నెగ్గుకురాగలమా అనే సందేహాలతోనే క్రైస్తవ ఎమ్మెల్యేలు బీజేపీని వీడుతున్నారు. మంత్రి, కలంగుట్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఎమ్మెల్యే పదవితో పాటు బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. పార్టీ పట్ల లోబో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.
లోబో తన భార్య దలియాకు సియోలిం నియోజవర్గం నుంచి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. లోబో కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తుండగా ఆయనను అక్కున చేర్చుకోవాలని టీఎంసీ కూడా ప్రయత్నిస్తోంది. లోబోతో టీఎంసీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంప్రదింపులు జరిపారు. ఉత్తర గోవాలో బలమైన నేతగా పేరొందిన లోబోకు కనీసం 5-6 నియోజకవర్గాల్లో పట్టు ఉంది. బీజేపీలో సామాన్య కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని లోబో కాషాయ పార్టీపై భగ్గుమన్నారు.
ఇక గత నెలలో కర్టోలిం ఎమ్మెల్యే అలినా సల్ధానా కూడా బీజేపీని వీడి ఆప్‌లో చేరారు. మరో క్రైస్తవ ఎమ్మెల్యే కర్లోస్ అల్మిద బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇక వెలిం ఎమ్మెల్యే మంత్రి పిలిఫ్ నెరి రోడ్రిగ్స్, నువెం ఎమ్మెల్యే విల్ఫ్రెడ్ డిసౌజా సైతం బీజేపీకి రాజీనామా చేశారు. తమ నియోజకవర్గాల్లో బీజేపీకి పెద్దగా ప్రాబల్యం లేకపోవడంతో విజయావకాశాలపై ఆందోళనతోనే వీరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, ఆప్, తృణమూల్ పార్టీల వైపు చూస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.