Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఇంకా వేడిగానే ఉంది. ఫాల్టాలో ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ లీడర్, మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీఎం సువేందు అధికారి ఘాటు విమర్శలు చేశారు. అభిషేక్ బెనర్జీకి కోల్‌కతాలో అక్రమ ఆస్తులున్నాయని సువేందు వెల్లడించారు. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపారు.
ఫాల్టాలో శనివారం జరిగిన ర్యాలీలో సువేందు అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీపై పరోక్షంగా విమర్శలు చేశారు. అభిషేక్ పేరెత్తకుండానే అతడి అవినీతి గురించి మాట్లాడారు. “గౌరవనీయులైన మేనల్లుడు బాబూ.. నిన్ననే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లోని మీ అక్రమ ఆస్తుల జాబితా నాకు చేరింది. అంతాలాలోని ఆఫీసులాగా కోల్‌కతాలో 24 ఆస్తులున్నాయి. 2023, డిసెంబర్ 3న నా పర్యటన సందర్భంగా హోటుగంజ్లోని నా పర్యటనకు హాజరైన వారిపై జరిగిన దాడిని మర్చిపోను. ప్రపంచం గుండ్రంగా ఉంటుంది. ఎవరూ, ఎప్పటికీ పదవిలో ఉండలేరు” అంటూ సువేందు వ్యాఖ్యానించారు.
అలాగే, ఈ ఐదేళ్లో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రికార్డులతో సిద్ధంగా ఉండాలని పోలీసుల్ని ఆదేశించినట్లు చెప్పారు. ఆదివారం నుంచే ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పినట్లు, ఎఫ్ఐఆర్ నమోదులు, అరెస్టులు చేయాలని సూచించినట్లు తెలిపారు. అలాగే, ఏ గూండాను కూడా వదిలేది లేదని చెప్పుకొచ్చారు. పిల్లలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారి, బంగ్లాదేశ్‌కు అనుకూలంగా నినాదాలు చేసేవారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసలో టీఎంసీ గూండాల చేతిలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
బాధితుల కుటుంబ సభ్యుల్లో 18 నుంచి 40 ఏళ్లలోపు వారు ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు, ఫలితాల తర్వాత బెంగాల్లో హింస జరిగిన సంగతి తెలిసిందే. అలాగే, భయంతో ఈ ప్రాంతం వదిలి వెళ్లిన వారి వివరాలు కూడా సేకరించాలని ఆదేశించినట్లు సువేందు అధికారి చెప్పారు.