ముంబై: ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయ కోవిదుడు అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ (94) గురువారం ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన 1930 సెప్టెంబరు 16న ముంబైలో జన్మించారు. ఆయన బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేశారు. ఆయన ‘ది కశ్మీర్ డిస్ప్యూట్ 1947-2012’, ‘ఆర్టికల్ 370 : ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్ము అండ్ కశ్మీర్’, ‘ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ వంటి పుస్తకాలు రాశారు.
అంతేకాకుండా జాతీయ, ప్రాంతీయ వార్తా పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. భారతీయ ముస్లింలకు సంబంధించిన అంశాల గురించి కూడా ఆయన రచనలు చేశారు. నూరానీ మృతి పట్ల జమ్ముకశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు సంతాపం ప్రకటించారు.