snake like bridge | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ (Bhopal)లో నిర్మించిన 90 డిగ్రీల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (90 degree flyover) దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ వంతెనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, ఇప్పుడు పాములా మెలికలు తిరిగిన మరో వంతెన (snake like bridge) వెలుగులోకి వచ్చింది. ఈ వంతెన నిర్మాణంలో ఇంజినీర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వంతెనపై డివైడర్లు సైతం సరిగా లేవు. అంతేకాదు కేవలం ఎనిమిది గంటల్లోనే రెండు ప్రమాదాలు సంభవించాయి. దీంతో దీని నిర్మాణం, భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భోపాల్‌లోని సుభాష్ నగర్లో రెండేళ్ల కిందట ఈ పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బిడ్జిని (Subhash Nagar Railway Over Bridge) నిర్మించారు. దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. సుభాష్ నగర్ ఆర్వోబీ మైదా మిల్లు-ప్రభాత్ పెట్రోల్ పంప్ మధ్య కీలక లింక్‌గా ఇది ఉంది. భోపాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జి ట్రాఫిక్ రద్దీని తగ్గించినప్పటికీ.. ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనలు బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదకరమైన లోపాలను బహిర్గతం చేశాయి. ఈ బ్రిడ్జి మెలికలు తిరిగి ఉండటంతో.. వాహనాలు కొన్ని నిమిషాల్లోనే పలుమార్లు మెలికలు తిరిగాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో ఈ బ్రిడ్జిపై ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎంత నిదానంగా వెళ్లినప్పటికీ.. మలుపుల వద్ద నియంత్రణకోల్పోయి ప్రమాదాల బారినపడుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
90 డిగ్రీల మలుపుతో వంతెన నిర్మాణం..
భోపాల్‌లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లో 90 డిగ్రీల మలుపు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనిపై ప్రయాణించే వాహనాలు ఒకేసారి 90 డిగ్రీల మలుపు తిరిగితే, ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోపాల్‌లోని ఐష్బాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, సుదీర్ఘ సమయం వేచి ఉండవలసిన అవసరాన్ని నివారించడం కోసం ఈ వంతెనను నిర్మించారు.
దీనివల్ల మహామాయి కా బాగ్, పుష్ప నగర్, స్టేషన్ ఏరియా వారికి ప్రయోజనం కలుగుతుంది. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే మూడు లక్షల మందికి ఈ వంతెన ఉపయోగకరం. ప్రయాణానికి పట్టే సమయం తగ్గుతుందని, ట్రాఫిక్ అంతరాయాలు తగ్గుతాయని అధికారులు చెప్పారు. . ప్రజా పనుల శాఖలోని వంతెనల శాఖ చీఫ్ ఇంజినీరు వీడీ వర్మ మాట్లాడుతూభూమి తగినంత అందుబాటులో లేనందువల్ల మరో అవకాశం లేకపోయిందని, ఈ వంతెనపై నుంచి చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. రెండు కాలనీలను అనుసంధానం చేయడానికే ఈ వంతెనను నిర్మించినట్లు తెలిపారు. వాహనాల వేగాన్ని పరిమితం చేస్తామన్నారు.
Also Read..
Pilot Collapses | టేకాఫ్‌కు ముందు కాక్‌పిట్‌లో కుప్పకూలిన పైలట్.. షాకింగ్ ఘటన
Uttarakhand CM | రైతుగా మారి.. పొలాన్ని దుక్కి దున్నిన సీఎం.. VIDEO