Supreme Court : ఇటీవల భారత్ నుంచి బహిష్కరించడంతో బంగ్లాదేశ్ (Bangladesh) కు వెళ్లిన సునాలీ ఖాటూన్ (Sunali Khatun) అనే గర్భిణిని (Pregnant Woman) తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) అంగీకరించింది. గర్భిణిగా ఉన్న మహిళ విషయంలో మానవత్వాన్ని చూపాలని సుప్రీంకోర్టు (Supreme Court) చేసిన సూచనతో ఈ చర్యలు తీసుకుంది.
అక్రమంగా దేశంలో ఉంటున్న బంగ్లాదేశీలను తిప్పిపంపించే క్రమంలో.. ఢిల్లీ వాసి అయిన సునాలీ ఖాటూన్ అనే గర్భిణిని, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు సబీర్తోపాటు మరో నలుగురిని అధికారులు దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. తాము భారత పౌరులమేనని వారు చెప్పినా పౌరసత్వానికి సంబంధించి వారి దగ్గర సరైన పత్రాలు లేవనే కారణంతో అధికారులు దేశ బహిష్కరణ చేశారు.
దాంతో తన కుమార్తె ఖాటూన్ భారత పౌరురాలేనని, గతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో వారి ధ్రువీకరణ పత్రాలు కాలిపోయాయని భారత పౌరుడైన ఆమె తండ్రి కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు చేసిన హైకోర్టు బంగ్లాదేశ్‌కు పంపిన ఖాటూన్‌ను మిగతా ఆరుగురిని తిరిగి తీసుకురావాలని, వారు తమ భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి కేసుల్లో సాంకేతిక అంశాలు కాకుండా మానవత్వంతో చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. సునాలీ తండ్రి భారతీయుడు అయినప్పుడు సునాలీ, ఆమె కుమారుడు కూడా భారతీయులే అవుతారని కోర్టు పేర్కొంది.
అంతేగాక ఆమె బహిష్కరణపై క్షుణ్ణంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. సునాలీ ఖాటూన్‌కు అత్యవసర వైదసాయం అవసరం ఉన్నందున మొదట ఆమెను, ఆమె కుమారుడిని భారత్‌కు తీసుకురావాలని సూచించింది. దాంతో సునాలీ ఖాటూన్‌ను దేశానికి తీసుకురావడానికి కేంద్రం అంగీకరించింది.