G20 Summit | భారత్‌లో మరో పది రోజుల్లో జరగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit)కు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలు దేశాల అధ్యక్షులు ఈ సమ్మిట్‌కు స్వయంగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అయితే, భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు జిన్‌పింగ్ హాజరుకారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
పుతిన్ కూడా..
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) సైతం శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదు. అయితే ఈ సదస్సులో వర్చువల్‌గా ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. జీ20 సమ్మిట్‌కు పుతిన్ స్వయంగా హాజరయ్యే ప్రణాళికలు ఏమీ లేవని తెలిపారు. వర్చువల్‌గా ఈ సదస్సులో పాల్గొనడాన్ని తర్వాత నిర్ణయిస్తామని అన్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ అరెస్ట్ కోసం వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో అరెస్ట్ భయం వల్ల ఆయన విదేశాల్లో ప్రయాణించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణ ఆఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అయితే వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.
Also Read..
Fire Accident | ఘోర అగ్నిప్రమాదం.. 63 మంది సజీవదహనం
Elections | జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమే : సుప్రీంకు తెలిపిన కేంద్రం